01-09-2025 10:47:53 AM
రైతులకు గాయాలు
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం(Kesamudram) రైతు వేదిక వద్ద యూరియా పంపిణీ కోసం టోకెన్ల జారీ ప్రక్రియ రసబాసగా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు మండల వ్యాప్తంగా ఉన్న రైతులకు యూరియా పంపిణీ కోసం టోకెన్లను జారీ చేయడానికి రైతు వేదిక వద్ద ఆదివారం బారి కేడ్లు ఏర్పాటు చేసారు. వెయ్యి మంది రైతులకు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆదివారం రాత్రి 9:00 నుండి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసినప్పటికీ రైతులు అక్కడే నిరీక్షించారు.
ఉదయం వ్యవసాయ అధికారి వెంకన్న రైతు వేదికకు(Rythu Vedika) చేరుకోగానే ఒక్కసారిగా రైతులు టోకెన్ల కోసం తోసుకున్నారు. దీనితో భారీకేడ్లు విరిగిపోయి ఒకరిపై ఒకరు పడ్డారు. ఫలితంగా పలువురికి స్వల్ప గాయాలు కాగా, బేరువాడకు చెందిన అనిత అనే మహిళ రైతు కాలు విరిగింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు కూడా అప్పటివరకు బందోబస్తు నిర్వహించి చేతులెత్తేశారు. దీనితో రైతు వేదిక భవనం పైకి చాలామంది రైతులు ఎక్కి టోకెన్ల కోసం ఎగబడ్డారు. మండల ఆఫీస్ కాంప్లెక్స్ వెళ్లే రహదారి పూర్తిగా ద్విచక్ర వాహనాలతో కిక్కిరిసిపోయింది. 460 మందికి ఒక్కో బస్తా చొప్పున టోకెన్లు జారీ చేసి ఆయా గ్రామాల పరిధిలో సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రం ద్వారా యూరియా పొందడానికి చర్యలు తీసుకున్నారు. అయితే చాలామంది రైతులకు టోకెన్లు లభించకపోవడంతో కేసముద్రం పోలీస్ స్టేషన్ వద్ద తొర్రూరు కేసముద్రం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.