03-08-2025 01:16:16 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): అమరుల స్ఫూర్తితో హక్కుల సాధనకై సంఘటిత ఉద్యమం తాగిస్తామని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యామగాని వెంకన్న అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామంలో అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కల్లుగీత కార్మికులను సంఘటితం చేసేందుకు 1957 లోనే సంఘం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ధర్మ బిక్షం, తొట్ల మల్సూర్, బైరు మల్లయ్య, దేశిని చిన్న మల్లయ్య తదితర నాయకుల నాయకత్వంలో సొసైటీ, టిఎఫ్ టీల ఏర్పాటు, చెట్టుపై గీత కార్మికునికె హక్కు, ఎక్సిగ్రేషియా, పెన్షన్ తదితర సౌకర్యాలను సాధించుకోవడం జరిగిందన్నారు.
అయితే నేడు కల్లుగీత వృత్తి పై లక్షలాది మంది ఆధారపడి జీవిస్తుంటే కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడుదారులు తమ లాభాల కోసం లిక్కర్, శీతల పానీయాలు విపరీతంగా తీసుకురావడం వల్ల వృత్తి దెబ్బతింటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానా నింపుకోవడానికి వీరికే ప్రోత్సాహం కల్పిస్తున్నారని, ఫలితంగా గీత కార్మికులు ఉపాధి కోల్పోయి రోజు వారి కూలీలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి తాటి, ఈత చెట్లు ఉన్నాయని, కల్లుతో పాటు నీరా, తాటి, ఈత ఉత్పత్తులు తయారుచేసి ఉపాధి కల్పించవచ్చన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పెన్షన్ 4 వేలకు, ఎక్స్ గ్రేషియా 10 లక్షల కు పెంపు, సొసైటీ కి 5 ఎకరాల భూమి, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ అభివృద్ధి, ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం ఏర్పాటు, జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామని ఇచ్చిన తదితర హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఈరగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రమాదాల నివారణకు వృత్తి చేసే గీత కార్మికులందరికీ సేఫ్టీ కిట్టు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా డబ్బులు 12 కోట్ల 94 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, గీత కార్మికుల హక్కులకై పోరాడి అమరులైన వారందరినీ యాది చేసుకుంటూ అమరజీవి బొలగాని పుల్లయ్య వర్ధంతి న ప్రారంభమైన ఈ యాత్ర సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు ముగుస్తుందని, గీత కార్మికులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కల్లు గీత కార్మిక సంఘం మహబూబాబాద్ ప్రాంతనికి చెందిన బోలగాని పుల్లయ్య, పెరుమాండ్ల జగన్నాథం, గండు ఐలయ్య, చలమల వీరస్వామి, అదెలా రాఘవులు, మందా రాములు గుండెపూడి గ్రామంలో చనిపోయిన గీత కార్మికులందరికీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొగుళ్ల యాకయ్య , గుండెపుడి కమిటీ సభ్యులు బోడపట్ల రవి, రేఖ శ్రీనివాస్, రేఖ వెంకన్న, గుండగాని మధుసూదన్, సోమ గాని శ్రీనివాస్, బోడ పట్ల రాజశేఖర్, కందాల రమేష్, రేఖ ప్రవీణ్, గుండ గాని రంగనాథ్ , రేఖ ఉప్పలయ్య పాల్గొన్నారు.