03-08-2025 03:26:51 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... మాగంటి గోపీనాథ్ చేసిన సేవలకు నివాళిగా, మరొక్కసారి జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరవేద్దామని పేర్కొన్నారు. 20 నెలల కాంగ్రెస్ అసమర్థ, అవినీతి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని, ఎన్నికల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలంతా వచ్చి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని తెలిపారు.
రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, మోసగాళ్లకు, మోసగాళ్ల పార్టీ అయిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. రానున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. 20 నెలల కాంగ్రెస్ మోసాన్ని చూసిన తర్వాత కూడా కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, ఇప్పటికే కాంగ్రెస్ గెలిచిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు. మళ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు వేసినా, ఉన్న పథకాలన్ని పోతాయని, కాంగ్రెస్ మోసానికి తెలంగాణ ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి భావిస్తారన్నారు. కాంగ్రెస్, బీజేపీల ఏకైక ఎజెండా భారత రాష్ట్ర సమితిని ఓడించడమే.. అందుకే ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు.