కన్నీటిపాలవుతున్న కళ్యాణలక్ష్మి!
కళ్యాణ లక్ష్మి పథకం అనేది నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన సామాజిక సంక్షేమ పథకం. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించి, వారి తల్లిదండ్రులకు కొండంత అండగా నిలిచిన పథకం ఇది. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, నిధుల లేమి,
ఉదాసీనత కారణంగా కళ్యాణ లక్ష్మి కన్నీళ్ల లక్ష్మిగా మిగిలిపోయింది. ఒకప్పుడు పేదల ఇండ్లల్లో కళ్యాణ కాంతులు నింపిన ఈ పథకం, నేడు కాలయాపనతో లబ్ధిదారులకు కన్నీళ్లను మిగులుస్తోంది.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ పథకాల అమలుకు సంబంధించిన చట్టబద్ధత కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని నాలుగు వారాల గడువు ఇచ్చినా, మళ్లీ గడువు కోరడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన సందేహాలున్న అంశంలో కౌంటర్ దాఖలు చేయకపోవడంతో,
ఈ పథకాల నిమిత్తం 2014 నుంచి జారీచేసిన 8 జీవోల అమలుపై స్టే ఉత్తర్వులిచ్చింది. అంతేకాకుండా, లబ్ధిదారులకు చెల్లింపులు చేయరాదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే న్యాయశాఖ ఉంటుంది. ఆయన పరిధిలో అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ ప్లీడర్, అనేకమంది న్యాయ కోవిదులు ఉంటారు.
ఒక్కరు కూడా దీనిపై స్పందించకుండా, సరైన సమయంలో కౌంటర్ వేయకుండా కాలయాపన చేశారు. కారణం, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాన్ని రద్దు చేయించి చేతులు దులుపుకుందామనుకుంటున్నట్లు కనపడుతోంది. కేసీఆర్‌కు ఈ పథకంతో ప్రజల్లో గొప్ప పేరు వచ్చింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని కొనసాగిస్తామని, లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా అదనంగా ఇస్తామని బీరాలు పలికింది. ఇప్పుడు తులం లేదు, లక్ష రూపాయలు లేవు. కళ్యాణ లక్ష్మి దుబారా పథకం కాదు. 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఒకసారి మాత్రమే నేరుగా లభించే ఆర్థిక సహాయం.
రైతుబంధు, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి లాంటి ఏ పథకాలకు లేని ఇబ్బందులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లకే ఎందుకు? కేసు కోర్టులో నడుస్తోందని, తానేమీ చేయలేననే మాటల్లో కాంగ్రెస్ కుట్రలు స్పష్టంగా బయటపడుతున్నాయి.
కళ్యాణ లక్ష్మి పథకాన్ని 2014 అక్టోబర్ 2న సీఆర్ ప్రారంభించారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి పదేళ్లలో లక్షలాది కుటుంబాలకు ఈ పథకం అండగా నిలిచింది. కేవలం బీసీ సంక్షేమ శాఖ ద్వారానే దాదాపు 2.41 లక్షల మంది, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాల ద్వారా మొత్తంగా 6 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి.
2024 2025- ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కో ఏడాది దాదాపు 2,17,247 దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 61 వేల నుంచి 62 వేల లోపు దరఖాస్తులు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. జనాభా, అవసరాలు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది.
2025- బడ్జెట్‌లో రూ.2,179.69 కోట్లు కేటాయించగా, 2026 వార్షిక బడ్జెట్‌లో దానిని రూ.2,173 కోట్లకు తగ్గించడం గమనార్హం. మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.650 కోట్లు కేటాయించగా కేవలం రూ. 403.90 కోట్లు, తదుపరి ఏడాది రూ. 278.4 కోట్లు మాత్రమే వాస్తవంగా ఖర్చు చేశారు.
గతంలో దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోనే లబ్ధిదారుల చేతికి అందే ఈ నగదు, ప్రస్తుతం నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పేద తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేసి ఏడాది గడుస్తున్నా, తమకు రావాల్సిన రూ. 1,00,116 కోసం సంక్షేమ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చిన నిరుపేదలు, ప్రభుత్వ సాయం ఎప్పుడు వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ జాప్యం కారణంగా వడ్డీల భారం రెట్టింపై వారు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. పిల్లల పెళ్లిళ్లై కాన్పులైనా కళ్యాణ లక్ష్మి చేతికందని పరిస్థితి.
కళ్యాణ లక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశం ఆడబిడ్డల పెళ్లి ఖర్చుల కోసం పేద తల్లిదండ్రులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి చిక్కుల్లో పడకుండా కాపాడటం. బాల్య వివాహాల నుంచి అమ్మాయిలను కాపాడటం. అమ్మాయికి ఖచ్చితంగా 18 ఏళ్లు నిండాలనే నిబంధన వల్ల రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి.
గత బీఆర్‌ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజాదరణ పొందిన పథకాలను కొనసాగించడం ఇష్టం లేకనే ప్రస్తుత ప్రభుత్వం ఈ జాప్యానికి పాల్పడుతోందని విపక్షాలు, లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. మొదట్లో ఈ పథకం పేరును కల్యాణమస్తుగా మారుస్తామని ప్రకటించిన పాలకులు, ఆ తర్వాత ఆచరణలో నిధుల విడుదలను అటకెక్కించారు.
కోర్టు కేసును ఒక సాకుగా చూపిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేసే వ్యూహంలో భాగమే ఈ నిర్లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం కోసం సుమారు 65,026 దరఖాస్తులు రాగా, అందులో 31,468 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
రెవెన్యూ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులను అడిగితే పై నుంచి నిధులు రాలేదు, కోర్టులో కేసు నడుస్తోందంటూ సమాధానాలు దాటవేస్తున్నారు. పెళ్లి సమయంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అటు ప్రభుత్వం నుంచి పైసలు రాక మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
రాజకీయాలు, పట్టింపులు ఎలా ఉన్నా పేద ప్రజల సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం తగదు. పెళ్లయి ఏడాది గడిచినా సాయం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి.
రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, కోర్టు పరిధిలోని సాంకేతిక, చట్టపరమైన లోపాలను సవరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ కళ్యాణ లక్ష్మి నిధులను వెంటనే విడుదల చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.
వ్యాసకర్త సెల్: 9492765358






