వృద్ధాప్యంలో పెన్షన్ టెన్షన్
తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ (ఓపీఎస్) విధానాన్ని అమలు చేయాలని కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దు చేయాలని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్‌ను రద్దు చేసి సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించి, ఆఘమేఘాల మీద అమలు చేస్తున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సీపీఎస్ విధానాన్ని అమలు చేయకుండా ఓపీఎస్‌ను అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీపీఎస్‌ను అమలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ఓపీఎస్‌ను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
బీఆర్‌ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో సంతోషించారు. ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తారని సంబురాలు చేసుకున్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, మంత్రులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం మాత్రం శూన్యం.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ వస్తుందనే భరోసా ఉండడం వల్ల అనేక మంది ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఆసక్తి చూపేవారు. ప్రైవేట్ ఉద్యోగులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే మూణ్నాలుగు రెట్లు ఎక్కువ జీతాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్‌ను తీసివేయడంతో నిపుణులు, ప్రతిభ కలిగిన వారు ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపడం లేదు. 30, 35 సంవత్సరాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ వస్తే ఎవరిపై ఆధారపడకుండా సుఖంగా జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి.
వృద్ధాప్యంలో పెన్షన్ రావడం వల్ల పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు టెన్షన్ లేకుండా గడుపుతారు. ఒక్కసారి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు అయితే జీవితాంతం వారికి పెన్షన్ సౌకర్యం ఉంది.
2004 తర్వాత అత్యున్నత స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ నుంచి కింది స్థాయి ఉద్యోగులు ఆఫీస్ సబార్డినేట్ నుంచి రికార్డు అసిస్టెంట్ వరకు ఉపాధ్యాయులలో ఎస్జీటీ, తెలుగు, హిందీ, ఉర్దూ ఇతర దేశీయ భాషలను బోధించే ఉపాధ్యాయుల వరకు అందరూ సీపీఎస్ కిందికే వస్తున్నారు.
2004 కంటే ముందు ఉద్యోగ, ఉపాధ్యాయుల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసి భర్తీ చేయడంలో ఆలస్యం జరిగిన ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఏపీలో 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ జారీచేసి భర్తీ ప్రక్రియలో ఆలస్యం జరిగిన ఉద్యోగ,
ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చిన వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్లో సీపీఎస్ అనేది ప్రధాన ఎజెండాగా మారింది.
అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల న్యాయపరమైన సమస్య అయిన ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ అన్ని ఉపాధ్యాయ,
ఉద్యోగ సంఘాల నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐక్యతను తెలియజేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది.
టీఆర్‌టీఎఫ్ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్, 9290826988






