18 August, 2026 | 1:14 AM

కల్యాణలక్ష్మిని ఆపలేదు..

18-08-2026 12:00 AM

రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

కరీంనగర్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం ఎత్తివేసిందంటూ బీ.ఆర్.ఎస్. నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఒక ప్రకటనలో విమర్శించారు. నిరుపేద ఆడపిల్ల ల పెళ్లిళ్లకు ఆసరాగా నిలుస్తున్న ఈ పథకాలను మేము ఆపలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం యథాతథంగా అందుతోందని స్పష్టం చేశారు.

నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే వెనకుండి కోర్టు డ్రామాలు ఆడిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాదరణ పొందుతున్న సంక్షేమ పథకాలపై రాజకీయాలు చేయడం వారి నైతిక దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ పథకాలపై కోర్టులో దాఖలైన పిటిషన్ వెనుక బీ.ఆర్.ఎస్.పార్టీకి చెందిన రాజకీయ కుట్ర దాగి ఉందని విమర్శించారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రతిపక్షం దిగజారుడు రాజకీయం చేస్తోందన్నారు.

అమలులో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఓటమి భయం, ఉనికి కాపాడుకునే తాపత్రయంతోనే బీ.ఆర్.ఎస్. నాయకులు ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారని, ప్రజలు వీటిని నమ్మవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్ని వర్గాల వికాసానికి కాంగ్రెస్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.