థగ్ లైఫ్ కోసం మరోమారు

30-04-2024 12:05:00 AM

నటుడిగా తెరపైనే కాదు సినిమాకి సంబంధించి తెర వెనుక కూడా కథా రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా విభిన్న పాత్రలు పోషిస్తుంటారు కమల్ హాసన్. ఆయనను ఒక వ్యక్తిగా కంటే కొన్ని కళల సమూహంగా చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ళ తర్వాత ప్రఖ్యా త దర్శకడు మణిరత్నం  కమల్ కలయికలో  నిర్మితమవుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. గతంలో తాను నటిం చిన పలు చిత్రాల్లోని పాటలకు సాహిత్యం అందించిన కమల్, ఈ సినిమా కోసం మరోమారు ఓ పాట రాశారట. ఈ విషయాన్ని స్వయంగా కమల్ వెల్లడించారు. శృతి హాసన్ తన తండ్రితో జరిపిన ఒక సరదా చర్చలో భాగంగా పలు విషయాలు పంచుకున్న ఆయన, ‘థగ్ లైఫ్’ గురించిన ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. కమల్ ఈ పాట రాయడం, దానిని సంగీత దర్శకుడు రెహమాన్ రికార్డ్ చేయడం అంతా కేవలం రెండు గంటల్లో అయిపోయిందట. ఈ విషయం తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు ఇప్పుడు. శింబు, త్రిష, నాజర్, గౌతమ్ కార్తిక్, ఐశ్వర లక్ష్మి తదితరులు తారాగణంగా రూపొందుతున్న ఈ సినిమాలో కమల్ త్రిపాత్రాభినయం చేయనున్నారట. ఉత్తర భారతదేశంలోని జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం యొక్క తర్వాతి షెడ్యూల్  త్వరలో ప్రారంభం కానుంది.