పీవోకే ప్రజాగ్రహం!
గత కొన్ని రోజులుగా పీవోకేలో జరుగుతున్న నిరసనలు క్రమంగా కొత్త మలుపు తీసుకుంటున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పన్నులు, విద్యుత్ చార్జీల భారం, ఉపాధి కొరవడటం వంటి ప్రజా సమస్యలతో ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు పాకిస్థాన్ పాలనను వ్యతిరేకించే స్థాయికి చేరుకోవడం గమనార్హం.
ఈ క్రమంలో పలువురు పీవోకే నాయకులు తాము పాకిస్థాన్‌లో భాగం కాదని నొక్కి వక్కానించడం, ఈ విషయంలో భారత్ మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరడం చర్చనీయాం శంగా మారింది. పీవోకేలో రగులుతున్న ఈ అసంతృప్తి ఒక్క రోజులో మొదలైంది కాదు.
పీవోకేకు స్వయంప్రతిపత్తి ఉన్నట్టు పాకిస్థాన్ ప్రపంచాన్ని నమ్మబలికేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అక్కడి రాజకీయ, ఆర్థిక, పాలనా వ్యవస్థపై పూర్తి నియంత్రణ పాక్ ప్రభుత్వానిదే అన్నది తెలిసిందే. స్థానిక పాలనా వ్యవస్థకు నిర్ణయాధికారం లేకపోవడం, సహజ వనరులపై హక్కులను కాలరాయడం వంటి సమస్యలు ఇప్పుడు ప్రజాగ్రహం రూపంలో బయటపడుతున్నాయి.
త్వరలో పీవోకే చట్టసభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శరణార్థుల కోసం కేటాయించిన స్థానాలు ఈ నిరసనలకు మరింత ఆజ్యం పోశాయి. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రభావాన్ని తగ్గించి, పాక్ అనుకూల విధానాల రూపకల్పనలో ఈ స్థానాలు కీలక పాత్ర పోషిస్తున్నా యన్న అభిప్రాయం గత కొంతకాలంగా పీవోకే ప్రజల్లో బలపడుతూ వస్తున్నది.
ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కాస్తా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలుగా రూపాంతరం చెందుతున్నాయి. అయితే, పాక్ జోక్యం లేని ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ప్రస్తుతం కొన్ని రాజకీయ వర్గాలు, ఉద్యమ నాయకుల నుంచి మాత్రమే వినిపిస్తున్నది. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి వీధి పోరాటాలకు దిగనప్పటికీ, పాక్ పట్ల అసంతృప్తి విస్తృతంగా పెరుగు తుందని చెప్పడానికి ఇది తార్కాణమని చెప్పవచ్చు.
ప్రస్తుత తరుణంలో భారతదేశ నాయకత్వం ఎలా స్పందిస్తుందనే విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో పీవోకే అంతర్భాగమని మన దేశం ఎప్పటినుంచో అంతర్జాతీయ వేదికలపైనా, దౌత్యపరంగా స్పష్టం చేస్తున్నది. ఈ నేపథ్యంలో పీవోకే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి భారత వాదనకు నైతిక, రాజకీయ బలాన్ని చేకూర్చుతున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇలాంటి సమయంలోనే భావోద్వేగాలకు గురికాకుండా ఈ అవకాశాన్ని భారత్ సద్విని యోగం చేసుకోవాలి. పీవోకే ప్రజల హక్కుల అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది.






