18-07-2025 07:14:08 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఏసీపీగా పని చేస్తున్న మహేష్ కుమార్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మహేష్ శుక్రవారం గుండెపోటుకు గురి కావడంతో మృత్యువాత పడ్డారు. ఆయన సతీమణి మాధవి హుజురాబాద్ ఏసీపీగా పని చేస్తున్నారు. మహేష్ హుజురాబాద్ నుండి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వర్తించేందుకు వెళ్తుంటారు. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకున్న ఏసీపీ మహేష్ ను వెంటనే హుజురాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని గమనించిన హుజురాబాద్ ఆసుపత్రి డాక్టర్లు గంటకు పైగా సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. మహేష్ మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించడంతో మృతదేహాన్ని కరీంనగర్ తరలించారు. 1995 బ్యాచ్ కు చెందిన మహేష్ మరణ వార్త పోలీసులను దిగ్భ్ర్భాంతికి గురి చేసింది. మహేష్ మృతి పట్ల కరీంనగర్ సి పి గౌస్ అలం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఏసిపి మహేష్ మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హుజారాబాద్ ఏసీపీ మాధవి భర్త ఏసీపీ మహేష్ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. పోలీస్ శాఖకు మహేష్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో వున్న మాధవికి, ఆమె పిల్లలకు మనోధైర్యాన్ని కల్పించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.