వ్యోమగాములకు ట్రంప్ భరోసా
తీసుకొచ్చేందుకు వస్తున్నాం అంటూ ప్రకటన
బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు
వాషింగ్టన్: గత కొద్ది నెలల నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు త్వరలోనే భూమ్మీదకు రానున్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump ) కూడా వారికి మద్దతుగా ప్రకటన చేశారు. ‘మిమ్మల్ని తీసుకొచ్చేందుకు వస్తున్నాం. అసమర్థుడి పాలన వల్లే మీరు అక్కడ చిక్కుకున్నారు.
వ్యోమగాములను భూమ్మీదకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. వారు చేసిన అలసత్వపు పనుల వల్లే వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇకపై నేను అలా జరగనివ్వను’ అని వారికి భరోసానిస్తూ కీలకప్రకటన చేశారు. తాము త్వరలో భూమి మీదకు చేరుకుంటామని ఇప్పటికే వ్యోమగాములు కూడా ప్రకటించారు. ఈ నెలలోనే వారు భూమిని చేరుకునే అవకాశం ఉంది. వారు నింగిలోకి వెళ్లిన స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు అక్కడే చిక్కుకున్నారు. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన రాకెట్ వీరిని తీసుకురానుంది.






