బ్యాంక్ మేనేజర్‌పై కరుణానిధి మనుమరాలి దాడి
లిఫ్ట్ సరిగ్గా పనిచేయట్లేదంటూ వాగ్వాదం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు
వివాదంలో కాయల్‌విజి
ఈ నెల 20న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
చెన్నై, జూలై 26: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనుమరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కాయల్‌విజి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. బ్యాంకు మేనేజర్ చెంప చెల్లుమనిపిచ్చిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చెన్నైలోని రద్దీ ప్రాంతమైన అడయార్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్ నడుస్తోంది. ఈ బ్యాంకు కార్యాలయం ఉన్న భవనం కాయల్‌విజికి చెందినదిగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అయితే ఈ నెల 20న భవన నిర్వహణకు సంబంధించి వివాదం తలెత్తింది.
భవనంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ గత కొంతకాలంగా సరిగ్గా పనిచేయడం లేదనే విషయమై బ్యాంకు అధికారులతో చర్చించడానికి ఆమె అక్కడకు వెళ్లారు. బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ క్యాబిన్‌లోకి ప్రవేశించిన కాయల్‌విజి ఆయనతో వాగ్వాదానికి దిగారు. లిఫ్ట్ సమస్యను వెంటనే పరిష్కరించకపోవడంపై ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాటామాటా పెరిగేసరికి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఆమె మేనేజర్ ప్రవర్తనను, హావభావాలను ఎగతాళి చేస్తూ విచిత్రంగా అనుకరించారు.
ఆవేశంతో ఊగిపోయిన కాయల్‌విజి తీవ్ర ఆగ్రహానికి గురై మేనేజర్ చెంపపై కొట్టారు. ఆ సమయంలో ఆమె పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె శాంతించలేదు. మేనేజర్‌పై మళ్లీ దాడి చేయడానికి ముందుకు వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.
ఈ ఘటనపై ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ హర్షీన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారిక విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తనను కొట్టి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కాయల్‌విజిపై కేసు నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా చేయడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






