calender_icon.png 29 September, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పటికైనా బీఆర్ఎస్ సరి చేసుకుంటే బాగుంటుంది: కవిత

29-09-2025 08:18:57 PM

హైదరాబాద్: లండన్ లో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత తెలంగాణ ప్రవాసులతో ఆదివారం ముఖాముఖీ నిర్వహించారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతిని దేశానికి రూల్ మోడల్ గా నిలపాలన్నదే సంకల్పంగా పనిచేస్తున్నానని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పని చేస్తుందని, అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పులు తేవడంపై స్పష్టమైన ఆలోచన ఉందని కవిత వివరించారు. తప్పనిసరిగా తనకు అవకాశం వస్తుందని, అప్పటివరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలన్నారు. తన వెనక ఏ జాతీయ పార్టీ లేదు.. జాతీయ పార్టీలో చేరే ఉద్దేశం కూడా తనకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మనిగిపోయే పడవ అని కవిత ఎదేవా చేశారు. అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణను కాంగ్రెస్ నేతలు భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ డీఎన్ఏ నాకు సరిపడదు అని కవిత వ్యంగ్యంగా మాట్లాడారు. 

బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్లు కష్టపడ్డాను, కొందరిలో స్వార్థం ప్రవేశించిందని ఆమె తెలిపారు. స్వార్థపరుల వల్ల కోట్లాది మంది బాధపడొదన్నదే తన తపన అని, ఇప్పటికైనా బీఆర్ఎస్ సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ లో చీలికలు రావొద్దనే ఇబ్బందైనా తట్టుకుని నిలబడ్డానని, పార్టీ బాగుండాలి.. బీఆర్ఎస్ వల్ల తెలంగాణ బాగుండాలని ఎంతో తగ్గానని కవిత తెలిపారు.  పార్టీలో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి, తన ఓటమి మొదలు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయన్నారు. 

ఆడబిడ్డగా కుటుంబం బాగుండాలి.. పార్టీ బాగుండాలనే ఉద్దేశంతోనే ఎంతగా ఇబ్బందిపడినా ఒక్క విషయం బయటకు చెప్పలేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చిందని కవిత వాపోయారు. విషయాలు ప్రజల్లోకి వచ్చాక స్పందించపోతే తప్పవుతుందని మాట్టాడా అని చెప్పారు. పార్టీ నుంచి బయటకు పంపడంతోనే ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేశా.. పార్టీ తనన్ను వద్దనుకున్నందుకు పార్టీ ఇచ్చిన పదవిని వద్దనుకున్నా అని కవిత పేర్కొన్నారు.