calender_icon.png 29 September, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువుల ఐక్యత కోసమే ఆర్ఎస్ఎస్ దైనందిన శాఖ

29-09-2025 08:21:19 PM

ఆర్ఎస్ఎస్ మంథని ఖండ బౌద్ధిక్ ప్రముఖ్ కెక్కర్ల అనిల్ కుమార్..

మంథని (విజయక్రాంతి): హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ మంథని ఖండ బౌద్ధిక్ ప్రముఖ్ కెక్కర్ల అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ మంథని, గుంజపడుగు ఉపమండలం విలోచవరం గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక దుర్గాదేవి మండపంలో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు, హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం, పర్యావరణ పరిరక్షణ, పౌరవిధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ ను ప్రజలకు చేరువ చేసిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మంథని ఖండ కార్యవాహ గర్రెపల్లి వెంకటేశ్వర్లు, ఖండ శారీరిక్ ప్రముఖ్ తూండ్ల సంతోష్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.