calender_icon.png 29 September, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22 ఏళ్లకే డీఎస్పీ కొలువు సాధించిన దాసరి రాహుల్

29-09-2025 08:17:13 PM

గ్రూప్-1 ర్యాంక్ సాధించిన రాహుల్

గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామంలో ఓ విద్యా కుసుమం వికసించింది. చిన్న వయసులోనే గ్రూప్-1 ర్యాంక్ పొంది పెద్ద కొలువు సాధించి ప్రతిభను చాటాడు. కట్టవారిగూడెంకి చెందిన దాసరి రాహుల్ ఏకంగా తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఉద్యోగం సాధించి ఔరా అనిపించాడు. రాహుల్ తల్లిదండ్రులు దాసరి శ్రీనివాస్-సరిత ఇరువురు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఎంపికైన రాహుల్ మాట్లాడుతూ నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతూనే మధ్యాహ్నం సివిల్స్ కి సిద్ధపడినట్లు తెలిపారు. 2023లో డిగ్రీ పూర్తి చేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024 లో విడుదల చేసిన అనుబంధ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ వన్ కి దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

గ్రూప్ వన్ ర్యాంకు ద్వారా ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివినట్లు తెలిపారు. కేవలం తక్కువ సమయంలోనే కష్టపడి చదవడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు. ఈ లక్ష్యసాధనలో 471 మార్కులతో రాష్ట్రస్థాయిలో 220 ర్యాంకుతో డిఎస్పీ ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. రాహుల్ తాత, అమ్మమ్మ నేరేడుచర్ల పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు చింత మల్ల సైదులు కోటేశ్వరమ్మ ప్రోత్సాహంతో, తల్లిదండ్రులు, మేనమామ చింతమల్ల రాంబాబు మార్గదర్శకత్వంలో డీఎస్పీగా ఉద్యోగం సాధించినట్లు రాహుల్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే డీఎస్పీ ఉద్యోగ సాధించి తన ప్రతిభను చాటుకున్న రాహుల్ ను నాయనమ్మ దాసరి సైదమ్మ స్నేహితులు, బంధువులు గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు.