07-08-2025 01:12:15 AM
రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు
హనుమకొండ టౌన్, ఆగస్టు 6 (విజయక్రాంతి): న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య , ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే. ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్యలతో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రి ని రైల్వే డివిజన్ ఏర్పాటు, కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో నూతన బస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించాల్సిన స్థలం, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధి చేయాలని కోరారు. కాజీపేట బస్ స్టేషన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి మంత్రి గారికి వివరించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించారని ప్రజా రవాణా దృష్ట్యా బస్సు స్టాండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పై అంశాల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. రైల్వే అధికారులు అంశాలను పరిశీలించి నివేదికలు పంపించాలని ఈ సందర్భంగా వారికి తెలిపారు.