పనితీరే ప్రామాణికం

08-05-2024 01:51:09 AM

ప్రచారంలో నిర్లక్ష్య ధోరణిని వీడాలి

పదవులు రావాలంటే పార్టీ విజయం కోసం కష్టపడాలి 

ఎవరి బాధ్యతలను వారే నిర్వహించాలి

రిజర్వేషన్ల అంశాన్నిప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి

రాష్ట్ర నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పని చేస్తున్నారనే విషయంతో పాటు అభ్యర్థుల విజయావకాశాలపై ఎప్పటికప్పుడు అధిష్ఠానం నివేదికలు తెప్పించుకుంటోందన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయం ఉన్నందున రాష్ట్రంలోని పరిణామాలపై పార్టీ నేతలతో కేసీ వేణుగోపాల్ మంగళవారం అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ.. దేశం ‘దిశ దశ’ మార్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే తదుపరి పదవులు ఉంటాయని, ఎవరూ నిర్లక్ష్య ధోరణితో ఉండొద్దని హితవు పలికారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడం దేశానికి ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని, కాంగ్రెస్ పట్ల సానుభూతి కలుగుతోందని వివరించారు. ఉత్తరాదిన బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయనే దక్షిణాదిన ఫోకస్ పెట్టారని, బీజేపీ చర్యలకు దీటుగా ప్రజలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లతో పాటు మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారనే అంశాన్ని ఆయా వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తద్వారా ఆయా సామాజిక వర్గాల ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని సూచించినట్లుగా తెలిసింది. 

రాష్ట్ర పరిస్థితులపై సీఎం వివరణ.. 

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వేణుగోపాల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పు అంశాన్ని  ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లామని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోనూ చర్చకు పెట్టారని తెలిపారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న రైతుబంధు పథకం కింద ఇచ్చే నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. త్వరలోనే రుణమాఫీ కూడా చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఉందని, 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని వివరించారు. 

కొందరు నేతలపై అసంతృప్తి..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. సికింద్రాబాద్ బాధ్యతలను అప్పగిస్తే.. నల్లగొండపైనే ఫోకస్ చేయడంపై మండిపడినట్లు సమాచారం. నల్లగొండ సెగ్మెంట్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలు చూసుకుంటారని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ విజయం కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. పార్టీ నేతల సమన్వయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ విఫలమయ్యారని చెప్పినట్లుగా సమాచారం. ఎన్నికల ఇన్‌చార్జిలు, అభ్యర్థులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. మంత్రి దామోదర్ రాజనర్సింహా సైతం హాజరు కాలేదు. ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదో వివరణ తీసుకుని అధిష్ఠానానికి నివేదించాలని మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదేశించారు. మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.