04-07-2025 01:44:31 AM
- యశోద ఆస్పత్రిలో చేరిక
- నిలకడగానే ఉన్నదన్న వైద్యులు
- మెరుగైన వైద్యం అందించండి
- సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం స్వల్ప అనారోగ్యంతో సోమాజీగూడ ఆస్పత్రిలో చేరారు. ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు ఆరోగ్య పరీక్షలు చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
కేసీఆర్ నీరసంగా ఉండడంతో గురువారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఆయన శరీరంలో బ్లడ్ షుగర్ అధికంగా, సోడియం మోతాదు తక్కువ ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైందన్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ వెంట సతీమణి శోభ, కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ ఆసుపత్రికి వెళ్లారు.
మెరుగైన వైద్యం అందించండి: సీఎం రేవంత్‌రెడ్డి
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఆసుపత్రి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌కు ఉత్తమ చికిత్సను అందించాలని సూచించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: బండి సంజయ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. స్వల్ప అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరిన ఆయనకు మెరుగైన చికిత్స అం దించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆయన కోరారు. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.