calender_icon.png 4 July, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ న్యాయం చేస్తాం

04-07-2025 01:45:41 AM

  1. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యేలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే భరోసా
  2. కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదంటూ పలువురు ఎమ్మెల్యేల వినతి
  3. మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి.. చీఫ్‌విప్ పదవి వద్దంటూ ప్రేమ్‌సాగర్‌రావు అలక
  4. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బుజ్జగించినా సమావేశం నుంచి బయటకు..

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): మంత్రి పదవులు ఆశించి భంగపడి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం అయ్యారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఖర్గే భరోసా ఇచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, న్యాయం చేస్తామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను గురువారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కలిశారు. మంత్రి పదవులు ఆశించిన మల్‌రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి, బాలునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తదితరులున్నారు.

కొన్ని జిల్లాలకు మూడు మంత్రి పదవులు ఇచ్చి కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో అసలు చోటే ఇవ్వలేదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కొత్తగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మంత్రివర్గంలో చోటుకల్పించిన విషయాన్ని ఖర్గేకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి వివరించారు.

ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఉండగా, జూపల్లి కృష్ణారావు, కొత్తగా వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో  చోటు ఇచ్చారని తెలిపారు. ఇక హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటులేకపోవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వివరించినట్లు తెలిసింది.

అలిగిన ప్రేమ్‌సాగర్‌రావు.. సమావేశం నుంచి వాకౌట్..

తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు  అలిగి బయటికి వెళ్లిపోయారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో ప్రేమ్‌సాగర్‌రావు భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవిని ఆశించారు. అయితే ప్రేమ్‌సాగర్‌రావుకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడంతో.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ప్రేమ్‌సాగర్‌రావును డిప్యూటీ సీఎం భట్టి బుజ్జగించినప్పటికీ ఆయన బయటికి వెళ్లిపోయారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో చాలా మంది నాయకులు కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లినప్పటికీ ప్రేమ్‌సాగర్‌రావు కాంగ్రెస్‌లోనే ఉండి పార్టీని కాపాడటం, ఆనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. 

విద్యా విధానంపై చర్చ..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యకు సంబంధించిన అభివృద్ధి, నూతన విధానాలు, ఫీజు రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చర్చించారు. వ్యవసాయ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో ఖర్గే సమావేశం అయ్యారు. పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు.