27-01-2026 01:30:33 PM
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రాంతీయ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అదానీ గ్రూప్, బ్రెజిలియన్ దిగ్గజం ఎంబ్రేర్ మంగళవారం ఒక వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటించాయి. ఇది దేశ స్వదేశీ తయారీ సామర్థ్యాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో ఒకటి, ఈ భాగస్వామ్యం టైర్ 2, 3 నగరాలకు ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎంప్రేర్ సంస్థల అధికారులు మంగళవారం జాతీయ రాజధానిలోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతదేశంలో ప్రాంతీయ రవాణా విమానాలపై వ్యూహాత్మక సహకారం కోసం అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. ఈ రెండు కంపెనీలు కలిసి దేశంలో ఎంబ్రేయర్ ప్రాంతీయ విమానాల కోసం ఒక తుది అసెంబ్లీ లైన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నాయి. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ అదానీ మాట్లాడుతూ, ఎంప్రేయర్ సహకారంతో భారతదేశంలో ఒక ప్రాంతీయ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.