calender_icon.png 27 January, 2026 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌన్ బనేగా బాన్సువాడ బల్దియా చైర్మన్...?

27-01-2026 04:01:47 PM

చైర్మన్ వేటలో ముఖ్య నేతలు

కారు, చేతు,అభ్యర్థుల ఖరారుకు దరఖాస్తుల స్వీకరణ

చాపకింద నీరులా  కమలం అభ్యర్థులు

చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో..?

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ ముఖ్య నేతలు సవాల్ గా తీసుకుంటున్న మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు తెగ పోటీ పడుతున్నాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు గెలుపు అభ్యర్థుల వేటలో నాయకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు చైర్మన్ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ నుండి పోచారం వర్గానికి సంబంధించిన  ముఖ్య అనుచరుడు మమ్మద్ ఎజాస్ సతీమణి  రేష్మ ఏజస్ ను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.

అదేవిధంగా గులాబీ పార్టీ నుండి ఆ పార్టీ నాయకుడు జుబేర్ సతీమణి ని చైర్మన్ కాండిడేట్ గా నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఏనుగు వర్గానికి సంబంధించిన ముఖ్య అనుచరుడు కొత్తకొండ నందిని భాస్కర్ ను బరిలోకి దించేందుకు సన్నహాలు కాగా, కమలం పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థి కోసం ఎవరన్నది ఇంకా పెండింగ్ లోనే పెట్టారు.

పార్టీ నియమావళి ప్రకారం మెజార్టీ స్థానాలను దక్కించుకున్న తరువాతే ఎవరన్నది పార్టీ పెద్దలు నిర్ణయించే సంస్కృతి ఉంది. దాంతో చైర్మన్ పేరును ఖరారు చేసేందుకు ఆ పార్టీ నాయకులు తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారు. పట్టణ ఓటర్లలో నానుతున్న మూడు పార్టీలలో  రెండు పార్టీల నుండి మాత్రమే చైర్మన్ ఎవరికి కేటాయిస్తారు అన్న పేర్లు బయట నానుడిలో ఉన్నాయి. మూడవ పార్టీ మూగనోము వేయడంతో ఆ పార్టీ పది స్థానాలను దక్కించుకుంటే చైర్మన్ ఎవరన్నది తేట తెల్లమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

మెజారిటీ స్థానాలు ఎవరికి దక్కేనో..?

బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉన్నాయి. రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారు. చేతు, కారు, కమలం పార్టీలపై అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. పోటీ తీవ్రత పెరిగి ఒక్కరికి టికెట్ లభించడం, ఆశించిన వారికి నిరాశ ఎదరడంతో పార్టీకి ఏ మేరకు  వారి నుండి సపోర్ట్ అందుతుందా అన్న అనుమానం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న 19 వార్డుల్లో పది స్థానాలను గెలుచుకున్న పార్టీ అభ్యర్థికి మాత్రమే చైర్మన్ పీఠంపై కూర్చునే అవకాశం ఉంటుంది. దీనికోసం  కాంగ్రెస్ పార్టీ తరఫున బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి తన ప్యానెల్ ను తయారు చేసుకున్నారు.

అదే పార్టీ నుండి ఎమ్మెల్యే పోచారాం శ్రీనివాస్ రెడ్డి సైతం 19 వార్డుల్లో తన అభ్యర్థులను నిలబెట్టే జాబితాను రూపొందించారు. అంతేకాకుండా మెజార్టీ స్థానాలు దక్కించుకొని ఎజాస్ సతీమణిని చైర్మన్ గా ప్రకటిస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంతకుముందు రేష్మ ఎజాస్ ఎంపీపీగా పూర్తి కాలాన్ని గడిపారు. ప్రస్తుతం ఆమెకే మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కేటాయించే అవకాశం కల్పించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి సైతం 19 వార్డుల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపి వారిని గెలిపించుకొని చైర్మన్ స్థానాన్ని పదిల పరుచుకునే  ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

చైర్మన్ ఎలా ఉండాలంటే..

మున్సిపల్ కార్పొరేషన్ లో చైర్మన్ పీఠంపై కూర్చునే వ్యక్తి నిస్వార్థపరుడై ఉండాలి. పట్టణంలోని అన్ని వార్డులను సమ భాగంలో అభివృద్ధి చేయాలి. అందుకోసం మున్సిపాలిటీకి వస్తున్న పనులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న నిధులను కూడా సమతూకంలో పంచిపెట్టాలి. వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సమావేశాలు నిర్వహించిన సమయంలో వస్తున్న సమస్యలను ఇప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రజలకు ప్రధానంగా ఉపయోగపడే తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ, లింకు సిసి రోడ్లతోపాటు ప్రజారోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత మున్సిపల్ చైర్మన్ పై ఎంతైనా ఉంటుంది.

ఇలాంటి బాధ్యతలు పోషించిన వ్యక్తి  మాత్రమే చైర్మన్ పీఠంపై అధిరోహించే అవకాశం కలుగుతుంది. అలాంటి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మున్సిపాలిటీలు బాగుపడే పరిస్థితి నెలకొంటుంది. రాజకీయ నాయకులను అండగా చేసుకుని పాలక పీఠంపై కూర్చుని వ్యక్తి తన పార్టీకే ప్రాధాన్యతనిస్తూ ఇతర పార్టీల కౌన్సిలర్ల నిర్లక్ష్యం చేస్తే వార్డులు అభివృద్ధి చెందే పరిస్థితి ఉండదు. ఇలా కాకుండా అన్ని వార్డులకు తానే అధిపతి అయిన భావనతో ఇంటి పెద్దదిక్కుగా తన పెద్దతనాన్ని కాపాడుకునే పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అలాంటి వ్యక్తినే వార్డు సభ్యుడుగా ఎన్నుకోవడంతోపాటు చైర్మన్ పీఠంపై కూర్చునే పరిస్థితి ఉందని మేధావులు పేర్కొంటున్నారు.