27-01-2026 04:05:14 PM
మత్తు పదార్థాల నివారణపై అవగాహన
భిక్కనూర్,(విజయక్రాంతి): చెస్ నెట్‌వర్క్ విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మత్తు పదార్థాలు, మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్ది ఇంద్రకణం రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, మేధస్సు అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. చెస్ వంటి మేధస్సును పెంపొందించే ఆటలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఆంజనేయులు పాల్గొని మత్తు పదార్థాలపై చట్టపరమైన చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.