30 May, 2026 | 2:20 AM

న్యాయవాది హత్యకు 25 లక్షల రూపాయల సుపారీ

30-05-2026 01:49 AM
  1. పాత కక్షలతోనే ఖాజా మోయిజుద్దీన్ హత్య
  2. ప్రధాన నిందితుడు ముజాహిద్ ఆలంఖాన్ అరెస్టు
  3. జనవరి నుంచి మృతుడి ఇంటి వద్ద రెక్కీ
  4. అదును చూసి ఈ 23న కారుతో ఢీకొట్టి హత్య 
  5. వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్

ఖైరతాబాద్, మే 29 (విజయక్రాంతి): మాసబ్ ట్యాంక్ వద్ద జరిగిన అడ్వకేట్ ఖాజా మోయిజుద్దీన్ హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ లోని సీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.

ఈ నెల 23 తెల్లవారుజామున అడ్వకేట్ ఖాజామోయిజుద్దీన్‌ను మాసబ్ ట్యాంక్‌లోని తన నివాసం వద్ద కారు ఎక్కే క్రమంలో కారుతో బలంగా ఢీకొట్టడంతో ఆయన మృతిచెందారు. మోయిజుద్దీన్ కుమారుడు ఎంఎస్‌ ఫర్హాన్ ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నంబర్ ప్లేట్‌లేని కారు మృతుని ఇంటి వద్దే కాపు కాసి, ఆయన బయటకు రాగానే ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి పారిపోయినట్లు స్పష్టమైంది.

సికింద్రాబాద్ లోని పంచవటి లాడ్జ్, నారాయణగూడలోని మెహఫిల్ హోటల్ వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు. కేసులో ముజాహిద్ ఆలంఖాన్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి కుటుంబానికి, అడ్వకేట్ కుటుంబానికి మధ్య మలక్‌పేట, లక్డీకాపూల్‌లోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ విషయంలో పాత గొడవలు ఉన్నట్లు తేలింది. వీరి మధ్య గత కొన్నేళ్లుగా సివిల్, క్రిమినల్, వక్ఫ్ ట్రిబ్యునల్ కేసులు నడుస్తున్నాయని పోలీసులు గుర్తించారు.

మోయిజుద్దీన్ న్యాయపోరాటం చేస్తూ తమకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చేలా చేస్తున్నాడని, దీనివల్ల తాము అవమానాలు ఎదుర్కొంటున్నామని భావించిన నిందితులు.. ఆయనను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు ఆలంఖాన్, తన తండ్రి మెహబూబ్ ఆలంఖాన్ కలిసి హత్యకు ప్రణాళిక రచించారు. అందుకు తమ సన్నిహితులైన హసన్ అలీ, మునీర్ ద్వారా కిషన్ అలియాస్ పప్పును సంప్రదించారు. కిషన్ ఈ పనికోసం వినయ్, విక్రమ్, అభిజిత్ వ్యక్తులను ఒప్పించాడు.

హత్య కోసం స్కార్పియో వాహనం కొనుగోలు చేయడానికి ముజాహిద్ ఆలం ఖాన్ రూ.2లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు. ఈ జనవరి నుంచి నిందితులు మృతుడి ఇంటి వద్ద, అతను తిరిగే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, అదను చూసి మే 23న కారుతో ఢీకొట్టి హత్య చేశారు. హత్య తర్వాత నిందితులు సాక్ష్యాలను చెరిపి వేసేందుకు ప్రయత్నించి వివిధ ప్రాంతాలకు పరారయ్యారు. సాంకేతిక కేతిక ఆధారాలతో కిషన్ అలియాస్ పప్పును హర్యానా లోని పానిపట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మిగిలిన నిందితులు ముజాహిద్ ఆలంఖాన్, మెహబూబ్ ఆలంఖాన్, అభిజిత్ ఆలియాస్ నాని, దిగన్ వినయ్, విక్రమ్ ఆదిత్య, మణిదీప్ ఆలియాస్ పోగో నానిలను అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కారు, రూ.10.10 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.