19-01-2026 12:00:00 AM
ఆకట్టుకున్న కళారూపాలు
ఖమ్మం టౌన్, జనవరి 18 (విజయ క్రాంతి): సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మంలో కామ్రేడ్స్ కదం తొక్కారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఖమ్మం పుర వీధులు కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరూ అరుణ పతాకాన్ని చేతబూని ఎర్రని వస్త్రాలు ధరించి ఖమ్మంకు తరలి రావడంతో ఆదివారం ఖమ్మం ఎర్రబారింది. ఉదయం 8 గంటల నుంచే సుదూర ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు ఖమ్మం చేరుకున్నారు. నాగపూర్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల నుంచి కూడా సభకు హాజరయ్యారు.
ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారులన్ని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల రాకతో దిగ్బంధించబడ్డాయి. ఎటు చూసినా అరుణ పతాక రెపరెపలే కనిపించాయి. ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. వందలాది వాహనాల్లో పార్టీ కార్యకర్తలు తరలి రావడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో యువత తరలి రావడం విశేషం. జనసేవాదళ్ కార్యకర్తలే కాకుండా బహిరంగ సభకు వచ్చిన వారిలో యువత ఎక్కువగా ఉన్నారు. ప్రజానాట్యమండలి పాటలకు అలిసి పోకుండా కేరింతలు కొట్టారు.
మూడు ప్రదర్శనలు - వేల మంది జనం
బహిరంగసభ సందర్భంగా ఖమ్మంలో మూడు ప్రదర్శనలు నిర్వహించారు. మొదటి ప్రదర్శన పెవిలియన్ మైదానం నుంచి ప్రారంభమైంది. జనసేవాదళ్ కార్యకర్తల కవాతుకు సిపిఐ అగ్ర నేతలు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుజ్జుల ఈశ్వరయ్య, చాడ వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, బాగం హేమంతరావు తదితరులు నేతృత్వం వహించారు.
జనసేవాదళ్ కార్యకర్తల తర్వాత సింగరేణి కార్మికులు, యువ మహిళలు, పర్ష పద్మ నేతృత్వంలో నాగళ్లు చేతబూనిన రైతు లు కోయ, లంబాడ, జానపద నృత్య కళాకారులు, వందలాది మంది డప్పు కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బతుకమ్మలతో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత న్యాయవాదులు, వైద్యులు, యువజన, విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ప్రదర్శన సాగింది.
ఖమ్మం నయాబజర్ కళాశాల నుండి మరో ప్రదర్శన ప్రారంభమైంది. నయాబజార్ కళాశాల నుండి ప్రారంభమైన ప్రదర్శన మయూరిసెం టర్, జెడ్పి సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా సభా స్థలికి చేరుకుంది. ఈ ప్రదర్శనకు రాష్ట్ర సహాయ కార్యదర్శి తకెళ్లపల్లి శ్రీనివాసరావు, బోస్, కె. శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తదితరులు నేతృత్వం వహించారు.
మూడవ ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైంది. శ్రీశ్రీ విగ్రహం నుంచి రోటరీ నగర్, మమత రోడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా సభా స్థలికి చేరుకుంది. జాతీయ సమితి సభ్యులు ఎస్కె సాబీర్పాషా, సిపిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి నేతృత్వం వహించారు.