20-08-2025 12:00:00 AM
ఖమ్మం, ఆగస్ట్ 19 (విజయ క్రాంతి): ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు వైద్యం అందించేందుకు ఒక వెల్నెస్ సెంటర్ ఖమ్మంలో ఉంది. ఈ వెల్నెస్ సెంటర్ ఖమ్మం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రాచీన భవనంలో ఉంది. ఈ వెల్నెస్ సెంటర్కు ఒక బోర్డు కూడా లేకపోవడంతో ఈ ఆసుపత్రిని కనుక్కోవటం కొత్త వారికి పెను సవాలే అవుతుంది.
వెల్నెస్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది అని తెలుసుకొని ఎవరైనా కొత్తవారు వెళితే ఈ ఆసుపత్రి తెలుసుకునేందుకు అరగంట పైన వారు అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఆసుపత్రి ప్రాంగణం బయటకాని, ఆసుపత్రి బిల్డింగు కు కానీ ఒక బోర్డు కూడా లేదు.
బిల్డింగ్ కూడా అతి ప్రాచీనమైన బిల్డింగ్ కావడం, అక్కడ వసతులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో, వైద్యం కోసం వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు కలుగజేసుకొని ఆసుపత్రి ప్రాంగణం బయట, బిల్డింగుకు బోర్డులు ఏర్పాటు చేసి సదుపాయాలు కూడా మెరుగుపరచాలని కోరుతున్నారు.