calender_icon.png 16 February, 2026 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజానికి కిక్ స్టార్ మార్గదర్శకం

16-02-2026 12:38:11 AM

పుస్తకావిష్కరణలో లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ 

హైదరాబాద్, ఫిబ్రవరి 15(విజయక్రాంతి): క్రమశిక్షణ, మంచి అలవాట్లు, క్రమబద్ధమైన జీవన విధానం అలవాటు చేసుకుంటే వైద్యులు, ఆసుపత్రుల అవసరం చాలా వరకు తగ్గిపోతుందని ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ ఎమ్మెల్యే, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. యువ డైటా లజిస్ట్, పోషకాహార నిపుణురాలు సాహిత్య లలితా కామేశ్వరి రచించిన 

‘కిక్ స్టార్ట్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడుతూ, చిన్న వయసులోనే సమాజానికి ఉపయోగపడే అంశంపై పరిశోధన చేసి పుస్తకరచన చేయడం ప్రశంసనీయమని అభినందించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రెడ్ హిల్స్‌లో శనివారం సాయంత్రం జరిగిన సభలో సూరి భగవంతం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సూరి బుచ్చి రామయ్య రచయిత్రి సాహిత్యను సభకు పరిచయం చేశారు.

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ, ఈ పుస్తకంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించవలసిన విలువైన విషయాలు ఉన్నాయని తెలిపారు. సైమాక్స్ లాబొరేటరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.సి. మూర్తి మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని ముద్రించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. భగవద్గీతలో ఆహార నియమాలను వివరించిన శ్రీకృష్ణుడిని తొలి డైటీషియన్గా భావించవచ్చని ప్రముఖ మీడియా, వ్యాపార వృత్తి నిపుణులు, ఇండియా టుడే, ది హిందూ పత్రికల మాజీ జనరల్ మేనేజర్ కృష్ణ కిరణ్ వ్యాఖ్యానించారు.

శరీర తత్వానికి తగ్గ నియమాలపై అవగాహన కల్పించడమే ఈ పుస్తకం రచన వెనుక ఉద్దేశమని రచయిత్రి సాహిత్య లలితా కామేశ్వరి తెలిపారు. ప్రముఖ పత్రికా సంపాదకుడు కొండుభట్ల శ్రీరామచంద్ర మూర్తి తన సందేశంలో ఈ పుస్తకం విశ్లేషణాత్మకంగా, పరిశోధనాత్మకంగా రచించిన అద్భుతమైన గ్రంథమని కొనియాడారు. కార్యక్రమంలో ఆశ్రిత గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఏ.వి.ఆర్. మూర్తి, రాజు చెన్నా, డాక్టర్ ఇంద్రగంటి శశికాంత్ శర్మ, ఆడిటర్ సాంబశివరావు పాల్గొన్నారు.