4 April, 2026 | 11:19 AM

టెస్టులకు కింగ్‌కోహ్లీ గుడ్‌బై

13-05-2025 12:00 AM
  1. ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయం అందించిన ఘనత విరాట్ సొంతం
  2. టీమిండియాను అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత
  3. ఇంగ్లండ్‌తో సీరిస్‌కు ముందు భారత జట్టుకు నిరాశ
  4. రిటైర్‌మెంట్‌పై ఇన్‌స్ట్రాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్

న్యూఢిల్లీ, మే 12: స్టార్ క్రికెటర్, మాజీ సారథి విరాట్ క్లోహీ కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. టెస్ట్ ఫార్మట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఈ మేర కు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. దీంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాను కూడా టెస్టుల నుంచి రిటైరవ్వాలనుకుంటున్నట్టు ఇటీవల బీసీసీఐకి చెప్పిన కోహ్లీ.. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశాడు.

2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విరాట్.. ఆ తర్వాత మూడేళ్లకే 2011లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. వెస్టిండిస్‌తో జమైకా వేదికగా టీమిండియా ఆడిన తొలి టెస్ట్‌లో క్యాప్ అందుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐదోస్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత టీమిండియా మేటి టెస్టు బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. కెప్టెన్‌గానూ సంప్రదాయ క్రికెట్‌లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు.

ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీ విజయం అందించాడు. ఇప్పటివరకు 123 టెస్టులు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో విరాట్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 254 పరుగులు. చివరగా 2025, జనవరిలో ఆస్ట్రేలి యాతో ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్.. పదివేల పరుగుల మైలురాయికి కొద్దిదూరంలోనే నిలిచి..

ఈ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ‘14 ఏండ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించా. ఈ ఫార్మాట్ నుంచి నన్ను దూరం తీసుకెళ్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించింది. తెల్లజెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా నా మనసుకు చాలా ప్రత్యేకమైంది. నిశ్శబ్దమైన ఆనందం.. సుదరీర్ఘమైన రోజులు.. ఎవరికీ కనిపించని చిన్నచిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి.

‘అలాంటి ఈ ఫార్మాట్ నుంచి దూరం జరగడం అంత తేలిక కాదు. కానీ, నా నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. ఈ ఫార్మాట్ కోసం నేను ఎంతో ఇచ్చా. నేను ఆశించిన దానికంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో వైదొలుగుతున్నా. వెనక్కి తిరిగి నా టెస్ట్ కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది’ అని కోహ్లీ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం రోహిత్‌శర్మ, కోహ్లీ ఒకేసారి పొట్టి క్రికెట్‌కు టాటా చెప్పారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రోహిత్ శర్మ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. అతడు వైదొలగడంతో ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ అత్యంత కీలకమవుతాడని అంతా భావించారు. అంతలోనే తానూ రిటైర్ అవ్వాలనుకుంటున్నానని విరాట్ బీసీసీఐకి సమాచారమిచ్చాడు.

దీంతో అతడిని బోర్డు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. కానీ, కోహ్లీ మాత్రం తన టెస్ట్ కెరీర్‌ను ముగించేందుకే సుముఖత వ్యక్తం చేశాడు. 2011లో టెస్ట్ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లి.. ఇప్పటివరకు 123 టెస్టులు ఆడి 9,230 పరుగులు సాధించాడు.

ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో విరాట్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 254 పరుగులు. చివరగా 2025, జనవరిలో ఆస్ట్రేలియాతో ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్.. పదివేల పరుగుల మైలురాయికి కొద్దిదూరంలోనే నిలిచి.. ఈ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు.