రాష్ట్ర ప్రజల నెత్తిపై కాంగ్రెస్ భస్మాసుర అస్త్రం
జనగామ: కాంగ్రెస్ పాలన కూడా కేసీఆర్ పాలన మాదిరిగానే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలోనూ ప్రజావ్యతిరేక విధానాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నిజాం వారసులేనన్నారు. రాష్ట్రప్రజల నెత్తిపై కాంగ్రెస్ భస్మాసుర అస్త్రం పెట్టిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకే రూ. 500 బోనస్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
జనగామ జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దొడ్డు బియ్యాన్ని కొనేందుకు సిద్దంగా ఉన్నా.. రాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, వెయిటింగ్లో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 రోజులుగా రైతుల ధాన్యం తీసుకొచ్చి సెంటర్లలో ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ ధాన్యం మొలకలొస్తుంటే ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదా? రైతుల సమస్యల కంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికే ఎన్నికలే ముఖ్యమయ్యాయ అని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేతగాని ప్రభుత్వంగా మారింది. ఈ ప్రభుత్వం సన్నరకం వడ్ల సాగును ప్రోత్సహించాలనుకుంటే.. వాటికి రూ.1000 బోనస్ ఇచ్చి, దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.






