calender_icon.png 12 January, 2026 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీపై తప్పుడు ప్రచారం

12-01-2026 12:31:58 PM

ఉపాధి కల్పించే పథకం.. మోదీ గ్యారెంటీ పథకం

నీతిఆయోగ్ సూచనల మేరకు పథకంలో మార్పులు

హైదరాబాద్: ఉపాధి హామీ పథకాన్ని తీసేశామని భారతీయ జనతా పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు. దేశంలో అనేక మార్పులు, సంస్కరణలు చేస్తున్నామని పేర్కొన్నారు. మార్పులకు అనుగుణంగానే ఉపాధి హామీ పథకం పేరు మార్చామని తెలిపారు. పేదలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశామని వివరించారు.

జవాబుదారీతనాన్ని ఈ పథకంలో తెచ్చామని వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పథకం అమలు చేసే అధికారం కల్పించామన్నారు. వంద రోజుల పనిదినాలను 125కు పెంచామని, రూ. లక్ష కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. గ్రామాలవారీగా అభివృద్ధి ప్రణాళికలు రచించుకుని మార్పు చేశామన్నారు. గతంలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఒక ఏడాది గుంతలు తవ్వితే.. వచ్చే ఏడాది కూడా అక్కడే గుంతలు తవ్వేవారని సూచించారు. గ్రామీణ కూలీలకు కూడా నైపుణ్య శిక్షణ పెంచుతామని వెల్లడించారు. 

వీబీ జీ రామ్‌ జీ ద్వారా గిడ్డంగులు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. వ్యవసాయ రంగానికి వీబీ జీ రామ్‌ జీని అనుసంధానం చేస్తామన్నారు. రైతుల కోరిక మేరకు వీబీ జీ రామ్‌ జీని తీసుకువచ్చామన్నారు. అడిగిన వారికి పని ఇవ్వలేని పరిస్థితుల్లో పరిహారం కూడా వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇది గుంతలు తవ్వే పథకం కాదు.. గ్రామాలను, దేశాన్ని అభివృద్ధి చేసే పథకం అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే పథకం.. మోదీ ఇచ్చే గ్యారెంటీ పథకం అని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త పథకంలో రాష్ట్రాలపైనే కాదు.. కేంద్రంపై కూడా ఆర్థిక భారం పడుతోందని చెప్పారు.

కొత్త పథకంతో రాష్ట్రాలకు అదనపు నిధులు వస్తాయని తెలిపారు. పథకం ఎప్పుడు అమలుచేయాలనేది రాష్ట్రాలే నిర్ణయిస్తాయని వెల్లడించారు. దళారీల దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ పథకం అమలు జరగకూడదనే కొత్త చట్టం తీసుకువచ్చామన్నారు. నేరుగా కూలీల ఖాతాలోనే డబ్బులు పడేలా చట్టం తెచ్చామని వివరించారు. ఏ రాష్ట్రంలో కూడా వంద రోజుల పనిదినాలు దొరకలేదని, కొత్త పథకానికి బడ్జెట్ లో రూ. లక్ష కోట్లకు మించి కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. నీతిఆయోగ్ సూచనల మేరకు పథకంలో మార్పులు చేశామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఆస్తులు సృష్టి జరగలేదు.. పేదవాడి శ్రమ వృథాగా పోయేది, దివ్యాంగులకు, వృద్ధులకు ఉపాధి హామీ కార్డులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.