12-01-2026 01:17:06 PM
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) సోమవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్-2026ను ప్రారంభించారు. తరువాత జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో(German Chancellor Friedrich Merz) కలిసి గాలిపటాలు ఎగురవేయడాన్ని ఆస్వాదించారు. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన తర్వాత, ప్రధాని మోదీ, ఛాన్సలర్ మెర్జ్ సబర్మతి రివర్‌ఫ్రంట్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండుగను నిర్వహించింది. కార్యక్రమ వేదిక వద్ద, ప్రధాని మోదీ, మెర్జ్ మహిళా కళాకారులతో ముచ్చటించి, గాలిపటాలు తయారుచేసే ప్రక్రియను తెలుసుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం, ఇద్దరు నాయకులు ఒక తెరిచిన వాహనంలో మైదానంలో పర్యటించారు. కైట్ ఫెస్టివల్ ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలను ప్రధాని తిలకించారు. సందర్శకులకు ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్స్ లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అభివాదం తెలిపారు.
గుజరాత్ ప్రభుత్వ ప్రకటన ప్రకారం, అహ్మదాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పతంగుల పండుగ-2026లో(International Kite Festival-2026 ) 50 దేశాల నుండి 135 మంది పతంగుల నిపుణులు, భారత్ నుండి దాదాపు 1,000 మంది కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా, గాలిపటాల ఔత్సాహికులు గత రెండు రోజులుగా రాజ్‌కోట్, సూరత్, ధోలవీరా (కచ్‌లో), స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (నర్మదా) వంటి ప్రదేశాలను సందర్శించి, సందర్శకులను మంత్రముగ్ధులను చేశారని అందులో పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ఈ ఉత్సవం జనవరి 14 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం, ఈ ఉత్సవం గుజరాత్ వ్యాప్తంగా 3.83 లక్షల కంటే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించింది. 'అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం' ద్వారా, గుజరాత్ పర్యాటక శాఖ ధోలవీర, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రముఖ సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలకు సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ పతంగుల ఉత్సవాన్ని తిలకించడానికి ఐదు లక్షల కంటే ఎక్కువ మంది పర్యాటకులు గుజరాత్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.