లో వోల్టేజ్ సమస్య.. పరిష్కరించాలంటూ కొల్లూరు సబ్‌స్టేషన్ ముట్టడి
ఆలేరు, ఆగస్టు 11 : మండలం లోని :గ్రామంలో నెలకొన్న విద్యుత్ లోవోల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కొల్లూరు విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామంలో చాలాకాలంగా నెలకొన్న లోవోల్టేజ్ సమస్య కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్కువ వోల్టేజ్ కారణంగా వ్యవసాయ బావుల వద్ద మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్లు, కూలర్లు, వాషింగ్ మెషిన్లు, ఫ్యాన్లు తదితర విద్యుత్ ఉపకరణాలు కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు. విద్యుత్ లోవోల్టేజ్ సమస్యకు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విద్యుత్ అధికారులను డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా లోవోల్టేజ్ కారణంగా కాలిపోయిన మోటార్లు, స్టార్టర్లు, గృహోపకరణాలను రైతులు వెంట తీసుకువచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, సర్పంచ్లు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






