6 August, 2026 | 12:33 PM

జొన్న రైతులకు రూ.77 కోట్లు విడుదల: ఎమ్మెల్యే వెల్లడి

06-08-2026 12:00 PM

నారాయణఖేడ్, ఆగస్టు 6: జొన్నల కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.77 కోట్లు విడుదల చేసినట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ డా. పట్లోళ్ల సంజీవరెడ్డి గురువారం తెలిపారు. జొన్నల కొనుగోళ్ల బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూ.77 కోట్ల నిధులను విడుదల చేసిందని చెప్పారు.

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30 జొన్నల కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 48 వేల మంది రైతుల నుంచి 50 వేల టన్నుల జొన్నలను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.183 కోట్లు జమ చేయగా, మిగిలిన బకాయిగా ఉన్న రూ.77 కోట్లను తాజాగా విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు రావాల్సిన ప్రతి రూపాయి సకాలంలో అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తన విజ్ఞప్తికి వెంటనే స్పందించి నిధుల విడుదలకు సహకరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఎమ్మెల్యే  కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ వినోద్ పాటిల్,సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.