బాధిత కుటుంబాలకు కేటీఆర్ భరోసా
ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాలలో పరామర్శలు
రాజన్న సిరిసిల్ల, జులై 13, (విజయ క్రాంతి): ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి, నామాపూర్, ఆవునూర్ గ్రామాల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం పర్యటించి ఇటీవల మృతి చెందిన పలువురు పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు.
చిప్పలపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం, నామాపూర్లో మాజీ ఎంపీటీసీ జూకంటి సులోచన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆవునూర్లో బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పద్మారెడ్డి సోదరుడు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మాజీ జడ్పీటీసీ కుటుంబానికీ పరామర్శ
ఎల్లారెడ్డిపేట మండల మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, హరిదాస్నగర్లోని వారి నివాసానికి వెళ్లిన కేటీఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా బీఆర్‌ఎస్ అండగా ఉంటుందనీ, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






