16-05-2025 02:11:30 PM
హైదరాబాద్: ఎట్టకేలకు వాస్తవాలు మాట్లడిన మంత్రి కొండా సురేఖ( Telangana Minister Konda Surekha)కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అభినందనలు తెలిపారు. 30 శాతం కమీషన్ తీసుకోకుండా సంతకం చేయట్లేదని కాంగ్రెస్ మంత్రే చెప్పారని కేటీఆర్ చమత్కరించారు. కొండా సురేఖ ఆరోపణలపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశిస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. డబ్బులు తీసుకుంటున్న మంత్రుల పేర్లను కొండా సురేఖ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్.. కమీషన్ సర్కార్ కావడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తోటి మంత్రులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి కొండా సురేఖ ఎమన్నారంటే? ''గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని నేను అన్నటువంటి వ్యాఖ్యలను కొంతమంది పూర్తిగా వక్రీకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేసిన. నా వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదు. ఈ మొత్తం ఇష్యూ మీద ఈరోజు వీడియో ద్వారా మరిన్ని వివరాలు తెలియజేస్తా'' అంటూ కొండా సురేఖ ఎక్స్ లో పోస్టు చేశారు.