16-05-2025 03:44:37 PM
హైదరాబాద్: విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని సూచించారు. 2025-26 లో విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. 2034-35కు విద్యుత్ డిమాండ్ 31,808 మెగావాట్లకు చేరుతోందన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధునాతన మౌలిక సదుపాయాల ఏర్పాటు గురించి అధికారులు రేవంత్ రెడ్డికి తెలియజేశారు. హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రీజినల్ రింగ్ రోడ్ (Regional Ring Road) లోపల నిర్మించనున్న రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఇంధన అవసరాలపై హెచ్ఎండీఏ(Hyderabad Metropolitan Development Authority)తో సమన్వయం చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.
విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ ఆధునీకరణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో భూగర్భ విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని, ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, స్తంభాలు, విద్యుత్ సరఫరా లైన్లు ఉండకూడదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడి నుండి హై టెన్షన్ లైన్లను కూడా తొలగించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌లో సచివాలయం, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వద్ద ప్రయోగాత్మకంగా స్మార్ట్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోని 160 కి.మీ.ల విస్తీర్ణంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) పరిధిలోని ఫుట్‌పాత్‌లు , నాలాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి పరిశీలించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.