06-12-2025 12:14:23 PM
హైదరాబాద్: సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్(Ambedkar) వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఘన నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. నూతన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి కేసీఆర్ ఆయనకు సమున్నత గౌరవం కల్పించారని కేటీఆర్ కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల సాధనకు పునరంకితమవుదామని కేటీఆర్ స్పష్టం చేశారు.