24 July, 2026 | 6:39 AM

పీవీ చరిత్రను దేశం ఎన్నటికీ మర్చిపోదు: కేటీఆర్

28-06-2024 02:50 PM

హైదరాబాద్: గొప్ప సంస్కరణశీలి, మేధావి పీవీ నరసింహారావు చరిత్రను దేశం ఎన్నటికీ మర్చిపోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి.. ఆర్థికంగా అతలాకుతలమై ప్రమాదం అంచున ఉన్న ఆర్థిక వ్యవస్థను కాపాడిన గొప్ప ఆర్థిక వేత్త పీవీ అని కేటీఆర్ కొనియాడారు. దేశంలో నవోదయ పాఠశాలలు, గురుకులాలు పెట్టి విద్యారంగానికి ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు. పీవీ గురించి ఎంత చెప్పినా తక్కువనే... ఆయన నిత్య విద్యార్థి, 80 ఏళ్ల వయసులో కంప్యూటర్ విద్య నేర్చుకున్న వ్యక్తి మనందరి జీవితాలకు ఆదర్శం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు.

తెలంగాణ భవన్ లో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.