11 August, 2026 | 2:02 AM

కేటీఆర్ ఆరోపణలు అవాస్తవం

11-08-2026 12:00 AM
  1. రాజకీయ లబ్ధి కోసమే ఆరాటం
  2. పూర్తి పారదర్శకతతోనే టెండర్ పీఎం ఏక్తా మాల్ టెండర్
  3. తప్పుడు ప్రచారం మానుకోవాలి
  4. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): రాయదుర్గంలో నిర్మించ తలపెట్టిన పీఎం ఏక్తా మాల్ టెండర్ ప్రక్రియపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పీఎం ఏక్తా మాల్ టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పూర్తి నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా ప్రక్రియ కొనసాగిందని స్పష్టం చేశారు.

జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులపై కూడా రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర నిధులతో రూపుదిద్దుకుంటున్న పీఎం ఏక్తా మాల్ ప్రాజెక్టుపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, ఫైనాన్షియల్ మోడల్, డీపీఆర్‌తో పాటు పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

రావిర్యాల భూ కేటాయింపులపై ఫేక్ ప్రచారం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడి కంపెనీకి తక్కువ ధరకే భూములు కేటాయించారంటూ వస్తున్న వార్తలు పచ్చి అబద్ధాలని మంత్రి శ్రీధర్‌బాబు కొట్టిపారేశారు. టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని, సీఎం కుటుంబాన్ని బద్నాం చేసే ఉద్దేశంతో ఫేక్ డాక్యుమెంట్లు, తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

రావిర్యాలలో టెస్సెరాక్ట్ అడ్వానస్డ్ సిస్టమ్స్కు భూముల కేటాయింపు ప్రక్రియ రహస్యంగా జరగలేదని తెలిపారు. కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కమిటీ ఆమోదంతో, పూర్తి పారదర్శకతతో, నిబంధనల ప్రకారమే భూముల కేటాయింపు జరిగిందని వివరించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు వండి వార్చిన వార్తలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు మైండ్గేమ్ ఆడుతున్నాయని శ్రీధర్‌బాబు విమర్శించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దోపిడీల బాగోతాలు బయటకు రాకుండా అడ్డుకునేందుకే ఆ పార్టీ నేతలు రాజకీయ డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకోవడం, తెలంగాణకు పెట్టుబడులు రాకుండా చేయడమే బీఆర్‌ఎస్, బీజేపీల లక్ష్యంగా కనిపిస్తోందని మంత్రి విమర్శించారు.