15 April, 2026 | 9:14 AM

500 మంది లేడీ ఆటో డ్రైవర్లు

05-02-2026 01:57 AM
  1. మహిళా స్వయం ఉపాధి కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ సరికొత్త ప్లాన్
  2. వీవీసీ మోటార్స్‌తో కీలక ఒప్పందం 
  3. రవాణా రంగంలోనూ మహిళలకు రాచబాట
  4. అదనపు డీజీపీ చారు సిన్హా

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): తెలంగాణలో మహిళా భద్రతతో పాటు సాధికారతే లక్ష్యంగా పోలీస్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ నగరంలో మహిళల ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలను నడిపేందుకు వీలుగా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, ప్రముఖ వాహన విక్రయ సంస్థ వీవీసీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్’తో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పంద కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారు సిన్హా పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఉమెన్-లెడ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లైవ్లీహుడ్స్ పేరుతో హైదరాబాద్‌లో ఒక పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. రాబోయే 12 నెలల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 500 మంది మహిళలను ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా తీర్చిదిద్దనున్నారు.

తద్వారా నిరుపేద మహిళలకు స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, పబ్లిక్ ట్రాన్సుపోర్టులో మహిళల భాగస్వామ్యం పెరుగు తుంది. ఈ సందర్భంగా అదనపు డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ.. ‘ఆసక్తి ఉన్న మహిళలను గుర్తించడం, వారిని సమీకరించడం, సంస్థాగత సమన్వయం బాధ్యతలను చూసుకుంటుంది. ఎంపికైన మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులో ఉంచేందుకు సహకరిస్తుంది. మహిళలు ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వాములవ్వడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో వారి ఉనికి పెరుగుతుంది’ అన్నారు.