ఉచిత ఆరోగ్య శిబిరాలు న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటేల్
నల్లగొండ టౌన్, జులై 23: ఉచిత ఆరోగ్య శిబిరాలు న్యాయవాదులు, న్యాయవాద సిబ్బందికి ఎంతో ఉపయోగకరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటేల్ అన్నారు. గురువారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కోర్టు ఆవరణలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించి మాట్లాడుతూ నేటి కాలుష్యం, మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి కారణంగా కొత్త వ్యాధులు పెరుగుతున్నాయన్నారు.
వ్యాధి వచ్చాక చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలు ముఖ్యమని సూచించారు. పరిశుభ్రత, వ్యాయామం, పోషకాహారం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.న్యాయవాదులు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, ఒత్తిడి వల్ల బీపీ, షుగర్, గుండె, కంటి, వెన్నునొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆరోగ్యవంతమైన న్యాయవాది సమాజానికి మెరుగైన న్యాయసేవలు అందిస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బార్ అసోసియేషన్, హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి కవిత, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తమరావు, మున్సిఫ్ జడ్జీలు హిమబిందు, సాయి సేరణ్ తేజ, మేఘన, బార్ అధ్యక్షుడు ఆకవరపు సతీష్ కుమార్, జనరల్ సెక్రెటరీ బి. అశోక్ కుమార్, ఉపాధ్యక్షురాలు నూకల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.






