17-10-2025 12:34:36 AM
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్... ఇది పేరుకే విలాసంవంతమైన ప్రాంతం. అందరూ అనుకుంటున్నట్టు ఈ ప్రాంతం కేవలం గ్లామర్ ప్రపంచానికి మాత్రమే అడ్డా కాదు. రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతోపాటు అధిక సంఖ్యలో మురికి-వాడలు, బస్తీలకు ప్రధాన నిలయం. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, అందమైన పార్క్‌లు, విశాలమైన రోడ్లే కాదు.. వందల సంఖ్యలో ఇరుకైన రోడ్లు, అగ్గి పెట్టెలాంటి గుడిసెలు సైతం ఉంటాయి.
ఇక్కడి బస్తీలే రేపటి లీడర్ల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఏ రాజకీయ నాయకుడికైనా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే దృఢమైన సంకల్పం ఉంటే నియోజకవర్గంలోని ప్రతి గల్లీని సుందరంగా తీర్చిదిద్దవచ్చు. కానీ నేటి పాలకులకు స్వప్రయోజనాలు తప్ప బస్తీవాసుల సమస్యలను పట్టించుకునే నాయకులు కరువ-య్యారు.
వాస్తవానికి ఈ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయంటే ఇక్కడి రాజకీయ నాయకుల అలసత్వం, పనితీరుకు అద్దం పడుతున్నది. రాజకీయ నాయకులు ఎంతసేపటికీ ఉన్నత వర్గాలు, వ్యాపారవేత్తలు ఉండే ప్రధాన ప్రాంతాల అభివృద్ధిపైనే దృష్టి సారిస్తారు..
తప్పితే మురికివాడల ప్రజలతో మమేకమై వారి అభివృద్ధికి చొరవ చూపిన సందర్భాలు చాలా తక్కువ. చిన్న చిన్న గల్లీలు.. నిత్యం దుర్గంధం వెదజల్లే మురికికుపాలు.. రోడ్లపై పారే డ్రైనేజీలు.. చిన్న చిన్న వర్షాలకే జలమయమయ్యే ఎన్నో మురికివాడలు ఇక్కడ ఎన్నో దర్శనమిస్తాయి.