calender_icon.png 9 December, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియమావళి ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

09-12-2025 12:27:58 AM

  1. పోలీసు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ 
  2. జిల్లాలో 3 ప్రధాన చెక్ పోస్ట్‌లు ఏర్పాటు
  3. నిరంతరం వాహనాల తనిఖీ నాకబందీ నిర్వహిస్తున్నాం..
  4. ఎస్పీ నితికా పంత్ వెల్లడి

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 8(విజయ క్రాంతి): రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలపరచే లక్ష్యంతో సోమవారం ఆసిఫాబాద్ పట్టణంలో పోలీసు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ నితికా పంత్, ఎఎస్పీ చిత్తరంజన్ లు పాల్గొన్నారు.ఫ్లాగ్ మార్చ్లో పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట మార్చ్ కొనసాగించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  గ్రామపంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా జరగడానికి పోలీస్ భద్రత పూర్తిచేసినట్లు  తెలిపారు. ప్రజల్లో నమ్మకం పెంపొందించడం, శాంతి పరిస్థితులను పర్యవేక్షించడం, ఎన్నికల సమయంలో అసాంఘిక/అవాంఛనీయ చర్యలను అరికట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశ్యమని తెలిపారు.ఎవరైనా గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం, అక్రమ ప్రవర్తనలు చేయడం లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని అన్నారు. ప్రజలు ఎన్నికల నియమాలను పాటించాలని, డబ్బులు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 3 ప్రధాన చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామన్నారు. 

మొదటి విడత 11 న జరిగే ఎన్నికలకు జిల్లా లో 650 మంది పోలీస్ శాఖ నుండి, 250 ఇతర శాఖలను సంబందించిన వారిని బందోబస్త్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజ భద్రతలకు భం గపరిచే ఏ చర్యలకైనా జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ (8712670551) ఏర్పాటుచేసినట్లు ఎస్పీ తెలిపారు.

జిల్లాలో నిరంతరం వాహనాల తనిఖీ నాకబందీ నిర్వహిస్తున్నట్లు, అనుమానిత వ్యక్తులు వాహనాల పట్ల క్షుణ్ణంగా పరిశీలిస్తున్నమని తెలిపారు. డిసెంబర్ 9 సా యంత్రం 5 గంటల నుండి మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఎన్నికల నియమా వళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, ప్రజలు భయభ్రాంతిలేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  ఆసిఫాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలాజీ వర ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్లు , పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.