calender_icon.png 31 January, 2026 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుష్టురహిత సమాజాన్నినిర్మిద్దాం

31-01-2026 02:05:10 AM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

తలమడుగు, జనవరి 30 (విజయక్రాంతి): ప్రజలందరి భాగస్వామ్యంతో కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పిలు పునిచ్చారు. శుక్రవారం తలమడుగు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం లో స్పర్ష్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుష్టు వ్యాధి కారక క్రిమిని కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ హ్యాన్సన్ చిత్రపటానికి సైతం పూలమాలలు వేశారు.

ఈ సంద ర్భంగా డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ కుష్టు వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గినప్పటికీ, వచ్చే రెండు సంవత్సరములలో కుష్టురహిత భారతదేశ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృత నిశ్చయంతో ఉన్నాయన్నారు. అందులో భాగంగా ప్రతి  ఏడాది రెండు సంవత్సరాలు ఆశా కార్యకర్తలచే కుష్టు వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు ఇంటింటా సర్వే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేది వరకు కుష్టు నివారణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు జాతరలు, సంతలు తదితర ప్రాంతాలలో కుష్టు వ్యాధిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

శరీరంపై పాలిపోయిన రాగి రంగు గల మొద్దు బారిన మచ్చలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించాలని అన్నారు. ఎం డి టి తో కుష్టు వ్యాధి పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స అందజేయనున్నట్లు తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి అంగవైకల్యం కలగదని అన్నారు.

ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఈశ్వరరాజ్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి నివారణకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్థానిక సర్పంచ్ ఎలుగు రాజన్న మాట్లాడుతూ ప్రజలు ఈ వ్యాధిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారుజిల్లా కలెక్టర్ గారి ప్రకటనను కార్యదర్శి గజానంద్ చదివి వినిపించారు. అనంతరం కుష్టు వ్యాధి నివారణలో భాగస్వాములు అవుతామని హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్,డి. పి. ఎం.వో. లు వామన్ రావ్, రమేష్, హెచ్.ఈ.వో చిన్న న్న, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.