31-01-2026 02:06:52 AM
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాల, జనవరి 30(విజయక్రాంతి): మంచిర్యాల నియోజక వర్గంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని చూసి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు కోరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని 60 డివిజన్ల అభ్యర్థులతో మంచిర్యా లలోని తన నివాసంలో, లక్షెట్టిపేట మున్సిపాలిటి పరిధిలోని 15 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులతో ఇటిక్యాలలోని శ్రీనివాస గార్డెన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో మంచిర్యాల నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని వివరించారు.
కార్పొరేషన్ పరిధిలో మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని, 60 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను, 15 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పొరేషన్ పరిధిలో ఓట్ల శాతం పెంచాలని ఓటర్లకు సూచించారు. లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ఫొటోను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పుస్తకంలో మొదటి పేజీలో ప్రచురించారని, ఇది మన నియోజక వర్గంలో జరిగిన అభివృద్దికి సంకేతమన్నారు. గడిచిన రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులను చూసిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు. అనంతరం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని డివిజన్‌ల వారీగా, లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారిగా అభ్యర్థులను ప్రకటిస్తూ పరిచయం చేశారు. ఈ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.