09-11-2025 01:39:08 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 08 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, బీఆర్‌ఎస్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనను అంతం చేద్దాం, మాగంటి సునీతమ్మను గెలిపిద్దాం అనే నినాదంతో బీఆర్‌ఎస్ శ్రేణులు శుక్రవారం జూబ్లీహిల్స్‌లో ఇంటింటా ప్రచారం చేసింది. బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌లో సుడిగాలి పర్యటన చేశారు.
బీఆర్‌ఎస్ నేతత పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, కార్పొరేటర్లు సామల హేమ, ప్రసన్న లక్ష్మీలతో కలిసి సునీత గోపినాథ్.. నేతాజీ నగర్, నటరాజ్ నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకూ వెళ్లి, ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
ఈ ఉపఎన్నికలో కారు గుర్తు కు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడు తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని, హామీలను గాలికొదిలి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ అరాచక, అవినీతి పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు తమ ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.