calender_icon.png 14 December, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీగా ఓటేద్దాం!

14-12-2025 12:00:00 AM

గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక రెండోసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక  రెండవ, మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తాయిలాలు అందించడం సహజం.

ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అభ్యర్థులు మాత్రం తమకు ఓటు వేసి గెలిపించాలని విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్థులు ఓటర్లను విపరీతంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సామాన్యుల నుంచి బాగా చదువుకున్న విద్యావంతుల సైతం ఈ ప్రలోభాలకు తలొగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. వివిధ కులాల దళారి నాయకులు.. ‘మా కులం ఓట్లు మీకేనని’ అభ్యర్థులకు చెప్పి డబ్బుల వసూలు చేస్తున్నారు.

ఈ విధంగా వారి కులాలను వాళ్లే తాకట్టు పెడుతున్నారు. మరోవైపు దళారుల సహకారంతో అభ్యర్థులు నిత్యం మందు పార్టీలతో ఓటర్లను మత్తులో ముంచెత్తుతున్నారు. ఓటుకు వెయ్యి నుంచి ఐదు, పది వేలు దాకా నగదు రూపంలో ఇస్తూ ఓట్లు కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటు ఒక వేలంపాటగా మారిపోయింది. ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే.. నోటుతోనే ఓటును పొందుతామనేది పోటీలో ఉన్న అభ్యర్థులకు సంస్కృతిగా మారిపోయింది.

అదే సమయంలో ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతి వైపు అడుగులేస్తుంటే.. ప్రలోబాలకు గురవుతున్న ఓటర్లు అంధకారంలోకి వెళ్లిపోతు న్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. దీనివల్ల నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసానికి గురవుతోంది.

స్వార్థ రాజకీయాలతో ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు హెచ్చుమీరుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రజలు.. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం సమస్యల వలయంలో చిక్కుకుపోయి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం.. ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ నాయకులు చేసే జిమ్మిక్కులను తిరస్కరించకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజలు ప్రతి వస్తువుపై కట్టే పన్నుల డబ్బుల ద్వారానే జరుగుతుంది. ఇది ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకులు సొమ్ము కాదు. దీన్ని ఓటర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకోసారి వస్తుంటాయి. ఈ ఐదు సంవత్సరాల కాలానికి అభ్యర్థులిచ్చే డబ్బు, మం దు.. రోజు సంపాదించే రూపాయి విలువ కూడా ఉండదు. కాబట్టి ఓటర్లు యాచకులుగా మారవద్దు.

మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు. ప్రలో భ పెట్టే నాయకుడు ఎన్నటికీ ప్రజానేత కాలేడు. డబ్బుతో ప్రలోభాలకు గురిచేసే నాయకులను తిరస్కరిద్దాం. గ్రామాభివృద్ధికి పాటుపడే పంచాయతీ ఎన్నికలను ఒక యజ్ఞంలా భావించి ప్రతి ఒక్కరు నిజాయితీగా ఓటేయాల్సిన అవసరముంది.

 విశ్వం