14-12-2025 12:00:00 AM
ఈసారి చలికాలం తన పంజా విసురుతున్నది. సాధారణంగా తెలంగాణలో డిసెంబర్ చివర్లో, జనవరి ఆరంభంలో చలి అధికంగా ఉంటుంది. కానీ డిసెంబర్ ఆరంభంలోనే చలి ఇంతలా వణికిస్తుండడంతో రాబోయే రెండు నెలలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోడానికి, చలి తీవ్రత పెరగడానికి ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలులే కారణమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
సాధారణంగా హిమాలయాల నుంచి వచ్చే శీతల గాలుల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సహజంగానే పడిపోతుంటాయి. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో గడ్డకట్టే చలి ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితుల ప్రభావానికి తోడు పొడి వాతావరణం, లానినా ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత కనిష్ఠ స్థాయికి దిగజారిపోతుండడమే.. అధిక చలి ప్రభావానికి కారణమని తెలుస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఇప్పటికే వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అక్కడి ప్రజలకు తాజాగా చలి గాలులు తోడవ్వడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు నాణ్యత పూర్తిగా క్షీణించడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు తక్షణమే పరిష్కారమార్గాలు తీసుకురావాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇతర నేతలు పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఢిల్లీ ఒక్కటే కాదు మెట్రోపాలిటన్ నగరాల్లోనూ చలి తీవ్రత అధికంగానే ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోనూ చలి వణికిస్తుంది. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుండడం గమనార్హం.
ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చర్మం పగుళ్లు రావడం, కళ్ల నుంచి నీరు రావడం, ఆస్తమా, బ్రాంకైటీస్, శ్వాసకోస వ్యాధి సంబంధిత రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వృద్ధులు చలికి తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. కాబట్టి ఇంట్లో ఎయిర్ కండీషనర్ ఉన్నవాళ్లు తమ గదులను ఎల్లప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
చిన్న పిల్లలకు స్వెటర్లు, నిండు దుస్తులు తప్పనిసరిగా వేయాలి. చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం సహజం. దీనిని నివారించేందుకు చర్మానికి మాయిశ్చరైజర్, శరీరానికి హానికరం కాని క్రీములు రాసుకోవడం ఉత్తమం. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కులు, మంకీ క్యాప్‌లు రక్షణగా అడ్డుపెట్టుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వృద్ధులు, పిల్లలు బయటికి రాకపోవడమే మంచిది.
ఇక ఆహారం విషయంలోనూ తగు జాగ్రత్తలు అవసరం. వృద్ధులు, పిల్లలు విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయల తో కూడిన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు తమ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. మనకు తెలిసిన చిట్కాలు పాటించి చలి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం.