20 May, 2026 | 8:24 AM

కరీంనగర్ బస్టాండ్ లో పుట్టిన చిన్నారికి లైఫ్‌టైం ఫ్రీ బస్ పాస్

19-06-2024 08:47 PM

హైదరాబాద్: కరీంనగర్ బస్ స్టాండ్ లో ఓ మహిళ బిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. ఊరెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చిన ఆ మహిళకు పురిటినొప్పులు రావడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది ఆమెకు పురుడు పోశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, ఆ మహిళా సిబ్బందిని అభినందించారు. దీంతో బుధవారం టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చిన్నారికి జీవిత కాలపు ఉచిత బస్‌పాస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత బస్‌పాస్ ఇవ్వాలనే యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకే ఈ ఆడపిల్లకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఉచిత బస్‌పాస్ మంజూరు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ విషయాన్ని తన ఎక్స్ లో తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో జూన్ 16వ తేదీన నిండు గర్భిణి అయిన కుమారికి పురుడు పోసిన సిబ్బందిని ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అభినందించారు. బుధవారం హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పురుడు పోసిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సైదమ్మ, రేణుక, భవాని, లావణ్యలను, బస్‌స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రజనీ కృష్ణ, స్టేషన్ మేనేజర్ నోముల అంజయ్యలను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వి రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పీవీ మునిశేఖర్, ఎస్ కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషాదేవి, తదితరులు పాల్గొన్నారు.