అద్దె ఇవ్వడం లేదని తహసీల్దార్ ఆఫీస్ కు తాళం
మెదక్: ఏడాది కాలంగా అద్దె చెల్లించక పోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. జిల్లా పరిధిలోని నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది. 18 నెలల నుంచి అద్దె చెల్లించడం లేదని ఎన్నిమార్లు తహసీల్దార్ కు, అదనపు కలెక్టర్, కలెక్టర్ దృష్టికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని యజమాని ఆరోపించారు. ఇక లాభం లేదని ఇవాళ ఇంటి యజమాని తరపు బంధువు కార్యాలయానికి తాళం వేశాడు. దీంతో ఉద్యోగులంతా ఆరు బయటే నిలబడాల్సి వచ్చింది. దీంతో విధులకు ఆటంకం కలుగుతుందని, అద్దె డబ్బులు త్వరలోనే అందేలా చేస్తామని తహసీల్దార్ సురేశ్‌కుమార్ హామీనివ్వడంతో కార్యాలయం తాళం తీశారు. ఈ సందర్భంగా నిజాంపేట తహసీల్దార్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ... ఇటీవల ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం నుండి రావాల్సిన మెయింటనెన్స్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అద్దె చెల్లింపుకు ఆలస్యమైంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని త్వరలోనే అద్దె చెల్లిస్తాం తహసీల్దార్ పేర్కొన్నారు.






