28-04-2025 02:22:58 AM
మహబూబాబాద్ ,ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ ఎస్ రజతోత్సవ సభ ఆ పార్టీ శ్రేణుల్లో భరోసా నింపింది. ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు, అధికారంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా, 2024 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంగా పార్టీ అధినేత కేసిఆర్, యువ నేత కేటీఆర్, పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్న హరీష్ రావు, కవిత పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ ఏడాదిన్నర కాలంగా తీవ్ర నిరుత్సాహం, నిస్తేజంలో ఉండగా.. ఎల్కతుర్తి రజతోత్సవ సభ కాస్త ఊరటగా మారింది. పార్టీ అధినేత కేసిఆర్ క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తూ.. మీరు ఎలాంటి భయాందోళనను చెందకండి.. పార్టీ లీగల్ సెల్ మీకు అండగా ఉంటుంది.. ప్రభుత్వ కేసులకు జంక కండి.. ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కుందాం.. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేద్దామంటూ.. ధైర్యం నింపారు.
దీంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం ఉరకలేత్తింది. దాదాపు గంటపాటు సుదీర్ఘ ప్రసంగం చేసిన కేసీఆర్ క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా ప్రసంగించడం విశేషం. ఉత్తేజ పూర్వకమైన ప్రసంగం, మధ్యలో అక్కడక్కడ తెలంగాణ యాసప్రాస.. కూడిన సామెతలతో ప్రసంగంలో ఉటంకిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.
ఆధునిక ఏర్పాట్లు.. పనిచేయని సెల్ ఫోన్లు
బీఆర్‌ఎస్ ఎల్కతుర్తి రజతోత్సవ వేడుకల్లో అత్యాధునిక వసతులతో కూడిన ఏర్పాట్లను చేశారు. అయితే లక్షల మంది హాజరయ్యే వేడుకకు అనుకూలంగా సెల్ఫోన్ వినియోగించే టవర్లను ఏర్పాటు చేయకపోవడంతో రజతోత్సవ వేడుక ప్రాంగణంలో లక్షల మంది కార్యకర్తలు హలో.. హలో.. కు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సభా ప్రాంగణంలో అధునాతనమైన డిస్‌ప్లే వేదికలను ఏర్పాటు చేసి దూరంలో ఉన్న వారికి కూడా సభా వేదిక స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశారు.
ఇక దాదాపు 150 ఎకరాలకు పైగా సభా ప్రాంగణంలో చీకటి కనిపించకుండా ఫ్లడ్‌లైైట్లను ఏర్పాటు చేశారు. దీనికి తోడు సభా వేదిక నుంచి కెసిఆర్ ప్రసంగం చివరి వరకు స్పష్టంగా వినిపించేలా ప్రత్యేకంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. అలాగే రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేకంగా బానసంచ కాల్చేందుకు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు అదిరిపోయేలా చేసినప్పటికీ.. సెల్ ఫోన్లు వినియోగించే విధంగా టవర్లను ఏర్పాటు చేయకపోవడంతో కొద్దిపాటి టవర్లు లక్షలమంది సెల్ఫోన్ వినియోగానికి అవసరమైన నెట్వర్క్ అందించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు..
ఉర్రూతలూగించిన కళాకారుల ఆటపాట..
హనుమకొండ, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల్లో మూడు గంటలకు పైగా కళాకారుల ఆటపాటలతో ఉర్రూతలూగించారు. మానుకోట ప్రసాద్, సందీప్, యూట్యూబ్ సంధ్య, జాంగ్రీ జాను తోపాటు రసమయి బాలకిషన్ తదితరులు తెలంగాణ ఉద్యమ సమయం నుండి మొదలుకొని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆటపాటలతో బిఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. సారే రావాలని, కారే కావాలని ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఆటపాటలతో ఉర్రూతలూగించారు.
ఎప్పటికీ గుర్తుండేలా..!?
మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): బీఆర్.ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనే కార్యకర్తలు నాయకులు ఎప్పటికీ గుర్తుండేలా.. సభా వేదికకు ఎడమవైపు ఫోటోలు దిగేందుకు వీలుగా ప్రత్యేకంగా బీఆర్ ఎస్ @25 అక్షరాలను ప్రత్యేకంగా రూపొందించడంతోపాటు పార్టీ అధినేత కేసిఆర్, యువనేత కేటీఆర్ ఫోటోలతో కూడిన వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికపై రజతోత్సవ వేడుకకు హాజరైనట్లు గుర్తింపుగా ఫోటోలు దిగడం కనిపించింది.