calender_icon.png 6 December, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీత కార్మికులు రక్షణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి

15-10-2024 04:44:30 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గీత కార్మికుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎస్.పి.డి.వి. శ్రీనివాస రావు, ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవ లక్ష్మి, జిల్లా ఆబ్కారీ శాఖ పర్యవేక్షకులు జ్యోతి కిరణ్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం, రక్షణ కొరకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఈ క్రమంలో గీత కార్మికులకు ప్రమాదాలు జరగకుండా వారికి శిక్షణను ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను అందించడం జరిగిందని తెలిపారు.

సిర్పూర్ నియోజకవర్గంలో 38 మంది గీత కార్మికులకు అందించడం జరిగిందని, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 31 మందికి  కిట్లను అందించడం జరుగుతుందని, గీతా కార్మికులు ఈ రక్షణ కిట్లను ధరించి చెట్లు ఎక్కాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. కోవ లక్ష్మి మాట్లాడుతూ.. గీత వృత్తిని గౌడ కులస్తులు తరాల నుండి కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారని, గీత కార్మికుడిపై కుటుంబం ఆధారపడి ఉంటుందని, ప్రతి గీత కార్మికుడు రక్షణ కిట్లను ధరించి తన వృత్తిని కొనసాగించాలని తెలిపారు. ప్రమాదాలను నివారించి కుటుంబ సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు. గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను అందించి వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అలీబిల్ అహ్మద్, జిల్లా ఇన్చార్జి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, ఆసిఫాబాద్ ఆబ్కారీ సి. ఐ. రమేష్, గౌడ సంఘం నాయకులు బాలేష్ గౌడ్, రంగు మహేష్ గౌడ్, గీత కార్మికులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.